పిల్లల్లో సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధులు: కారణాలు మరియు సంకేతాలు
పరిచయం
కాలానుగుణంగా వస్తున్న మార్పుల కారణంగా చిన్న పిల్లలు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పిల్లలకు మాటలు వచ్చేంత వరకు వారికున్న సమస్యలను తెలపలేక సతమతం అవుతుంటారు. మరి ముఖ్యంగా శిశువులు చాలా సున్నితంగా ఉంటారు. ఒక శిశువు రోగ నిరోధక శక్తిని పొందడం ప్రారంభించే సమయంలో అనేక అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మరి ముఖ్యంగా పసిపిల్లల జీవితంలోని మొదటి కొన్ని సంవత్సరాలు అంటువ్యాధులు, రోగాల భారీన పడుతుంటారు. ఆ సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు ఎదురయ్యే సమస్యలను గురించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే పిల్లల్లో వచ్చే కొన్ని లక్షణాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తుండడం ద్వారా మీ పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోవచ్చు.
పిల్లల్లో కలిగే సాధారణ సమస్యలు
దగ్గు
- పిల్లల్లో జలబు నుంచి మొదలుకుని అలర్జీ, ఫ్లూ, ఆస్తమా వంటి అనేక సమస్యలు దగ్గు రావడానికి కారణాలు అవుతున్నాయి.
- వైరల్ ఇన్ఫెక్షన్ల ద్వారా కూడా ఈ దగ్గు వస్తుంటుంది. సాధారణంగా పిల్లల్లో వచ్చే దగ్గు వాతంటత అదే తగ్గిపోతుంది కానీ కొందరిలో మాత్రం దీర్ఘకాలంగా వేధిస్తుంది.
వికారం, వాంతులు
- వాంతులు అనేది పిల్లల్లో అంతర్లీన వ్యాధి యొక్క లక్షణం. పసిపిల్లలు పాలు తాగుతున్నప్పుడు కడుపులో ఉన్నదంతా ఒక్కసారిగా బలంగా కక్కేస్తుంటారు. పిల్లలు పదే పదే వాంతులు చేసుకోవడం వల్ల వారి శరీరం డీహైడ్రేషన్ కు గురై అనేక అనారోగ్య సమస్యలు సైతం వస్తాయి.
- వాంతులు పిల్లల్లో వచ్చే సాధారణమైన సమస్య అయినప్పటికీ మరి ఎక్కువగా వాంతులు అవుతుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి.
ఛాతి నొప్పి
- ఛాతిలో తిమ్మిరి మరియు నిరంతర దగ్గు, జలుబు, వికారం మొదలైన సాధారణ సమస్యల వల్ల పిల్లల్లో ఛాతి నొప్పి వస్తుంది.
- పిల్లలకు వారి అన్నవాహికలో యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు తలెత్తినప్పుడు ఈ సమస్య వస్తుంది.
- తమ రోజువారీ జీవితంలో పిల్లలు ఆందోళనకు మరియు మానసికంగా ఒత్తిడికి గురైన కూడా పిల్లల్లో ఛాతి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
కడుపునొప్పి
- పిల్లలు బాగా ఏడుస్తున్నారంటే అందులో ముఖ్య కారణం కడుపు నొప్పి కుడా కావచ్చు.
- సురక్షితం కానీ ఆహారాన్ని పిల్లలకు ఇవ్వడం ద్వారా కడుపునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- శిశువులలో కడుపునొప్పికి కారణమైన వాటిలో గ్యాస్ సమస్య అన్నది సర్వసాధారణం.
- పిల్లలకు అధికంగా ఆహారాన్ని ఇవ్వడం కూడా అనుచితమైన పరిస్థితులకు దారితీయవచ్చు. బాటిల్ పాలు ఇచ్చే పిల్లల్లో ఈ తరహా సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.
తలనొప్పి
- సాధారణంగా 5 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో ఈ తలనొప్పి సమస్య వస్తుంది. చాలా సందర్భాల్లో ఇది సాధారణంగా మొదలై అది దీర్ఘకాలంగా కూడా కొనసాగవచ్చు.
- పిల్లల్లో జలుబు, సైనస్, ఏదైనా రకమైన జ్వరం కారణంగా కూడా తలనొప్పి సమస్య వస్తుంది.
- ఆహారపు అలవాట్లు, నిద్ర సరిగ్గా లేకపోవడం, వాతావరణంలో వచ్చే మార్పులు, డీహైడ్రేషన్, అతి నిద్ర, ఒత్తిడి ఇలా అనేక కారణాల వల్ల కుడా తలనొప్పికి గురవుతారు.
- పిల్లలు తరచుగా తలనొప్పి సమస్యను ఎదుర్కొంటున్నా మరియు అదే పనిగా తలపట్టుకుని ఏడుస్తు ఇబ్బంది పడుతుంటే ఒక సారి వైద్యుడిని సంప్రదించండి. నిర్లక్యం చేస్తే మాత్రం అది తీవ్రమైన వ్యాధి లక్షణం కూడా కావచ్చు.
ఊబకాయం
ప్రస్తుతం పిల్లల్లో ఊబకాయం అనేది అతిపెద్ద సమస్య అని చెప్పవచ్చు ఎందుకంటే:
- చిన్నారుల్లో ఆహారపు అలవాట్లు బాల్యంలోనే ఏర్పడతాయి కావున ఆ సమయంలో సరికాని ఆహారపు ప్రవర్తన కారణంగా పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారు.
- పిల్లలు బయట ఆటలకు దూరంగా ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం మరియు అనారోగ్య జీవనశైలి కారణంగా ఈ ఊబకాయం సమస్య వస్తుంది.
- ఈ అధిక బరువు వల్ల చిన్నపిల్లల్లో ఫ్యాటీ లివర్ సమస్యలు కూడా తలెత్తున్నాయి. కాబట్టి చిన్నారులలో ఊబకాయం సమస్యకు ప్రధాన కారణమైన ఆహారపు అలవాట్లను తల్లిదండ్రులు మొదటి నుంచి నియంత్రించాల్సిన అవసరం ఉంది. అందుకే చిన్నతనం నుంచి వారి ఆహారపు అలవాట్లను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలి. మంచి ఆహారం తీసుకోవటాన్ని మాత్రమే ప్రోత్సహించాలి.
చర్మ సమస్యలు
- చిన్న పిల్లల చర్మం ముట్టుకుంటే కందిపోయేంత మృదువుగా, సుతిమెత్తగా ఉంటుంది. అందుకే కాస్త ఎండ తగిలినా కందిపోవడం, చల్లటి వాతావరణంలో పొడిబారిపోవడం వంటి లక్షణాలు సాధారణంగా జరుగుతాయి.
- చిన్న పిల్లల్లో సాధారణంగా వచ్చే చర్మ సమస్యల్లో మోటిమలు, ఆటలమ్మ, చర్మశోథ, మిలియ, డైపర్ ర్యాషెస్ ముఖ్యమైనవి. చిన్న పిల్లల చర్మం వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు కూడా త్వరగా లోనయ్యే అవకాశం ఉంటుంది. చిన్నారుల చర్మ సమస్యల విషయంలో తల్లితండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
నిద్రలేమి సమస్య
- ఈ నిద్రలేని సమస్య అనేది నెలల వయసున్న శిశువులను సైతం ఇబ్బంది పెడుతుంది. పిల్లలలో నిద్ర సమస్యలు 6 నెలల నుంచి యుక్త వయస్సు వచ్చే వరకు వస్తాయి. అయితే పిల్లల్లో నిద్ర సంబంధిత సమస్యలను గుర్తించడం కాస్త కష్టమే అని చెప్పాలి.
- రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, చాలా త్వరగా ఉదయాన్నే నిద్రలేవడం, రాత్రి సమయంలో పదే పదే మేల్కొనడం, మళ్లీ నిద్రపోవడంలో ఇబ్బందిగా అనిపించడం వల్ల ఈ నిద్రలేమి సమస్య వస్తుంది.
- ఆడుకోవడానికి బదులు నిశ్శబ్దంగా కూర్చోవడం, ఆహారం తీసుకోవడం తగ్గించడం, అన్ని వేళలా నీరసంగా ఉండడం వంటి పలు రకాల రుగ్మతల కారణంగా పిల్లల్లో ఈ నిద్రలేమి సమస్య వస్తుంది.
- పిల్లల్లో వచ్చే వ్యాధులకు కొన్ని రకాల మందులను అందించడం ద్వారా కూడా ఈ నిద్రలేమి సమస్య వస్తుంది. అలాంటి సందర్భాలలో మీరు వైద్యులను సంప్రదించి పరిష్కార మార్గం తెలుసుకోవాలి.
విటమిన్-D లోపం
- విటమిన్-D స్దాయిలు చాలా తక్కువ మోతాదులో ఉండడం వల్ల పెద్దవారికే కాదు చిన్న పిల్లల్లో కూడా అనేక సమస్యలు వస్తాయి. ఈ విటమిన్-డి లోపం వల్ల పిల్లల్లో ఎముకలు బలహీనంగా మారడం, వంకర్లు పోవడం వంటివి జరుగుతాయి. సరైన పోషకాహారం లేకపోవడం వల్ల ఈ సమస్య మరింత పెరిగి ఇబ్బందులకు గురిచేస్తోంది.
- పిల్లల్ని తల్లితండ్రులు ఎండలో తగినంత సమయం గడిపేలా చర్యలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి కాపాడుకోవచ్చు. దీని వల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగానూ ఆరోగ్యంగా ఉంటారు.
నెలలు నిండకముందే పుట్టిన పిల్లలు, తక్కువ బరువుతో పుట్టినవారు మరియు పుట్టుకతోనే గుండెజబ్బులు ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. చిన్నవయసులోనే క్యాన్లర్లు వచ్చిన పిల్లలు, ఫిట్స్‌తో బాధపడేవారు, నీరసంగా ఉన్నట్లు కనిపించే పిల్లలు, తరచుగా తలనొప్పులతో బాధపడే పిల్లలు, చూపు సమస్యలు ఉన్న పిల్లలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడూ మెడికల్ చెకప్ లు చేయిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలి.
About Author –